Friday, November 16, 2007

రాదారీ నీ కేది దారి

నేను హైదరాబాదు వచ్చి ఉద్యోగం చేస్తున్న కొత్తలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలవులపుడు మావూరు వెళ్ళే వాడిని.ఓసొస్ ఇంతేనా మేము ఆమాట కొస్తే ప్రతి ఆంధ్రావాడు అంతేలేవొయ్ పుల్లాయ్ అనుకుంటున్నారా ?నేను అందరిలా కాదు. ఫ్రగతికి చిహ్నం చక్రాల బండి మీద వెళ్ళేవాడిని కాదు. నా కీలుగుర్రం మీద మాత్రమే వెళ్ళేవాడిని.నాలుగు రోజులు ముందుగానే హడావుడి మొదలయ్యేది.బండి మెకానిక్ కి ఇచ్చి సర్వీసు చేయించడం కర్బొరేటర్ చూసావా? జెట్ సరిగా సుబ్రం చేసావా ? మైలేజ్ 55 రావాలి అంటూ పిచ్చి పిచ్చి షరతులు పెట్టడం అలా అతని బుర్ర వీలున్నంత తినడం మహా సరదా గా వుండేది.ఈ బాలు గాడి బండి మళ్ళీ జన్మలో చేయకూడదు అని మా మెకానిక్కు మావయ్య
చిరాకు పడుతూనే మొత్తానికి నాబండి మాత్రం అదిరిపొయే లాగా చేసేవాడు.(ఈ అదురుట అనునది చూపులకు మరియు పరుగులకు మాత్రమే అని గ్రహించవలెను.)ఇక వూరికి ప్రయాణం అయ్యే రొజు సరే సరి జేబు నిండా డబ్బులు బండి నిండా తైలం తో మహా పైలా పచ్చీసు వ్యవహారం ఆ రోజు ప్రొద్దుట్నుంచే ఎవరైనా నాతో తోడుగా వస్తారా అని అందరినీ విసిగించే వాడిని.చివరకు వాళ్ళు నువ్వు వెంటనే వెళ్ళకపొతే మేమందరం కలిసి ఉతుకుతాం అనేంతవరకు ఉండేది వ్యవహారం.(ఇది మాత్రం వారిని ఇబ్బంది పెడదాం అని కాదు హై వే ప్రయాణం మన ఇష్టం వచ్చినట్లు అనేది ఎంత బాగుంటుందో తెలియజేయాలని).సాయంత్రం ఎనిమిది అవుతూండగా చివరకు నేను ఒక్కడినే బయలుదేరేవాడిని అందరూ రాత్రి జర్నీ వద్దురా బాబూ అంటూన్నా వినేరకం కాదు మరి.నిదానంగా ఉప్పల్ రింగురోడ్డు తిరిగి నాగొలు వరకు వచ్చే సరికి 9:00 అయ్యేది అక్కడ దాభా లో నాకిష్టమైన రోటీ పనీర్ బటర్ మసాలా తో ఆరగించి మళ్ళి మొదలయ్యే సరికి రాత్రి 10:00 అయ్యేది.ఎల్ బి నగర్ చౌరస్తా మలుపు తిరగ్గానే ఏదో చెప్పలేని అనందం చాన్నాళ్ళ తరువాత కనబడిన ప్రాణస్నేహితుడిని చూసినట్లుగా అనిపించేది.అప్పుడు కొంచెం కొంచెం గా చలి మొదలయ్యేది.జర్కిన్ వేసుకుని ఆక్సిలరేటరు ఒక తిప్పు తిప్పానంటే బండి మబ్బుల్లో తేలిపోతుండేది.వూరు దాటగానే హై వే మీద మంచి ద్రాక్ష పళ్ళ కోసం వేట కొంచెం పచ్చిగా వున్న వాటిని కొని జాగ్రత్తగా డిక్కీ లొ పెట్టి మరల ప్రయాణం షురూ.సుర్యాపేట లో టీ కొసం కాసెపు ఆగే వాడిని.జివ్వుమని చలిగాలి నరాలను మెలిపెడుతుంటే మరల ప్రయాణం మొదలు.దారి మధ్యలో ప్రమాదానికి గురైన బండ్లు వళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళరా అబ్బీ అని గుర్తు చేస్తుండేవి.మధ్య మధ్యలో విఠలాచర్య సినిమాలో గాలిలో తేలే దెయ్యాల మాదిరిగా మంచు తెరలు తెరలు గా పలకరిస్తుండేది.చివరకు 5:30 6 :00 గంటల మధ్యలో మధ్యలో తెనాలి చేరేవాడిని.ఇ వన్నీ యుక్త వయస్సు తీపి గురుతులు అందుకే కొత్త బైక్ కొన్న తరువాత కూడా నా పాత స్కూటరు ని అలాగే వుంచేశాను.మా స్నేహితులు చాలామందికి దాని మీదే మొదటిసారి టూ వీలర్ నడిపిన అనుభవం.

ఐతే ఈ మధ్య విజయవాడ జాతీయ రహదారి దుస్థితి చూస్తే చాలా బాధ వేస్తుంది. గాయాల పాలయి చివరిదశలో వున్న స్నేహితుడిని చూసినట్లుగా మనసంతా వికలం అయిపోయింది.దాదాపు 375 కిలోమీటర్ల పొడవున 12 జిల్లాల వారిని రాజధానికి చేర్చే ఈ రహదారి చాల చోట్ల గ్రామాలలో పొలాలకివెళ్ళే డొంక రోడ్ల కన్నా అధ్వాహ్నంగా తయారయ్యింది.ఈ గతుకుల దారి లో ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి రహదారి రక్తసిక్తం కాని రోజు అంటూ లేదు.ఒ కప్పుడు ఆడతా పాడతా తిరిగిన దారేనా ఇది అని అనిపిస్తుంది.మా రహదారిని బాగు చెయ్యండ్రా మొర్రో అని మనం కెంద్రాన్ని మొత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పొరుగు రాష్ట్రంలో గంటకు 200 బండ్లు అయునా తిరుగని రహదారులకి కోట్లు ఖర్చు పెడుతూ మనకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు.ఇప్పటికైనా పేరుగొప్ప రాజకీయ నాయకులందరు రాజకీయాలకు అతీతంగా ఏకమై మన జాతీయ రహదారిని బాగుచేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.లేక పోతే మన జాతీయ రహదారి దారి గతి గోదారే.

1 comment:

మాలతి said...

బాగుందండీ, మీకీలుగుర్రంతో మొదలుపెట్టి వాస్తవమైన సమస్యని పాఠకులముందు పెట్టడం. కథ చక్కగా సాగింది.

మాలతి