Monday, April 21, 2008

దున్నపోతు అన్నం తింటూదా?

అసలు ఈ తిండి,దాని వెరైటీలు, కాంబినేషన్లు ఇలాంటి గొడవ నాకు ఏ మాత్రం పట్టదు.చిన్నప్పట్నుంచీ కూడా ఇంట్లో ఏది వండితే అది తినడమే కానీ నాకు ఇది కావాలి అని ఎప్పుడూ మారాము చెయ్యలేదు.ఇప్పుడు కూడా మాశ్రీమతి ఏది వండితే అది తినిపెడ్తుంటాను.(శాకాహారం మాత్రమే)నాకు మాంసాహారం అలవాటు లేదు. తనకి ముక్కలెనిదే ముద్ద దిగదు అని కాదు కానీ దాదాపు వారానికి 4 సార్లు తినే అలవాటు. నాకేమో వంటింట్లో వండుతుంటే బాత్రూంలో బెక్ బెక్. అందుకని పాపం నాన్ వెజ్ వంటకాలకి బంద్ పెట్టింది.(త్యాగమయి)కానీ అప్పుడప్పుడూ మా పాలకొల్లులో సముద్రం చేపలు, మంచి నీటి చేపలు అబ్బ ఎంత బాగా దొరికేవో మిమ్మల్ని చేసుకున్నాక వాటిని తినే అద్రుష్టం దూరమైంది అంటూ దెప్పి పొడుస్తూ వుంటుంది.ఇంక పిల్లలు వాళ్ళు మాత్రం ఏదీ సరిగా తినరు.ఈ సమ్మర్ లో బాగా నీళ్ళు త్రాగుతూ తిండి తగ్గించేసారు. కొద్దిగా పొట్టలో ఖాళీ వుంటే దానిని కుర్కురె, లేస్, 5 స్టార్ లాంటి వాటితో నింపేస్తున్నారు.మా బాబు అయితే మరీ బక్కచిక్కి పోయాడు.అయితే నిన్న సాయంత్రం డాడీ ఈ వాల సండే కద లేస్ కొందాం పద (ఒకప్పుడు సండేస్ మాత్రమే లేస్ అని ఒక రూల్ పెట్టా) అంటూ మొదలెట్టారు. నాకు బాగా కోపం వచ్చింది. ఎప్పుడూ ఆ గడ్డి తింటూ నే వుంటారా ? అన్నం మానేసి ?అని గద్దించా.వెంటనే మా అమ్మాయి సమాధానం"నువ్వెప్పుడూ మమ్మల్ని అడ్డ గాదిదల్లారా, దున్నపోతుల్లారా అని అటూంటావుగా దున్నపోతులు అన్నంతింటాయా అందుకే గడ్డి కొనిపెట్టు" నాపర్సులో వంద నోటు దున్నపోతు కి గడ్డి మోపైందని వేరే చెప్పాలా