Friday, October 19, 2007

అల్లరి దయ్యం

అవి నేను ఉయ్యూరు లో ఐ.టి.ఐ వెలగబెడుతున్న రోజులు. కొన్ని రోజులు మామయ్య వాళ్ల ఇంట్లో నే వున్నా. తరువాత వాళ్లు విజయవాడ వెళ్లడంతో బయట స్నేహితులతో వుండాల్సి వచ్చింది.ఒక రోజు మా వేంకట రమణ సినిమాకి వెళ్లదాం రా రా సన్నాసీ అని లాక్కు వెళ్ళాడు.పెద ఓగిరాల లో అనుకుంటా నాకు సరిగా గుర్తు లేదు క్రొత్త హాలు కట్టారు. రెండవ ఆట శ్రీకృష్ణ పాండవీయం సినిమా కి బయలుదేరాం సైకిలు మీద ఇద్దరం.ఉయ్యూరు నుండీ దాదాపు 5 కిలోమీటర్లు దూరం ఉంటుంది.చెరకు ఆడే సమయం కావడంవల్ల బాగా రద్దీ గా వుంది దారంతా.సినిమా మోజులో సరదాగానే త్రొక్కుకుంటూ వేళ్ళాం.తిరిగి వచ్చే టప్పుడు హిడింబి,రాక్షసులు అంటూ ఏవే వో మాట్లాడుతూ వస్తున్నాం.ఇంత లో మా ముందు వెళుతున్నచెరకు ట్రాక్టరు ఒక్కసారిగా బ్రేక్ వేయడం మేము రోడ్డు దిగువన చింతచెట్టు (అనుకుంటా చాలా పేద్దది గా వుంది) దాపులో పడిపోవడం జరిగింది.ఒళ్ళంతా కొట్టుకు పోయింది చెప్పులు తెగి ఎక్కడో పడిపోయాయి.తరువాత రోడ్డు మీద పడిపోయిన సైకిలు తీసి త్రొక్కడం మొదలెట్టాను మా వేంకట రమణ మీద నమ్మకం పోయింది అప్పటికే.విచిత్రం గా ఎంత త్రొక్కినా సైకిలు కదలడం కష్టంగా వుంది.దానితో చిన్నప్పుడు విన్న దెయ్యాల కధలన్నీ ఒక్క సారిగా గుర్తుకు రాసాగాయి.మా వేంకట రమణ హనుమంతుడి భక్తుడు మహామొండి ధైర్యం కలవాడు.దెయ్యం లేదు నీ మొహం లేదు నీకు దెబ్బలు తగలడం వల్ల నీరసమైపోయావు అంటూ వాడు సైకిలు త్రొక్కటానికి ముందుకు వచ్ఛాడు.మళ్లీ అదే విచిత్రం వాడికి కూడా సైకిలు కదలడం లేదు.దానితో ఇది దయ్యం పనై వుంటుందని గుండె జారిపొయ్యింది.(అంగలకుదురు ప్రైవెటు లో రాత్రంతా నిద్రపోకుండా స్నేహితులు చెపుతుంటే విన్న దెయ్యం కధల మహాత్యం).ఇంకా రాత్రి సైకిలు నడిపించుకుంటూ మొత్తం మీద ఇంటికి చేరాము. అప్పటి కే వణుకుతూ జ్వరం తెచ్చుకున్న నన్ను వాడు రూములో వదిలేసి రూములోని మిగతా వారికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు .బారెడు తెల్లారింది కాని నేను మాత్రం లేవలా నాజ్వరం, వణుకుడు ఇంకా ఎక్కువయ్యాయి. ఆ రోజు క్లాసు కి డుమ్మా కొట్టేసా. స్నేహితులందరూ మందులు ఇచ్చి టీ త్రాగించి క్లాసుకి వెళ్ళిపొయ్యారు.మధ్యాహ్నం వేళకి బాత్ రూం కి వెళ్ళటానికి లేచాను. బయట బాత్ర్రూం కి వెళ్ళి వచ్చెటప్పుడు గోడవారగా నిలబెట్టిన సైకిలు మీదకి దృష్టి మళ్ళింది. అప్పుడు కనపడింది రాత్రం తా నన్ను వణికింపజేసిన దెయ్యం. వెనుక టై రు కి , మడ్ గార్డు గి మధ్యలో ... నా తెగిపొయిన చెప్పు ముక్క. వెంటనే తీసి పారేశాను లేకపోతే నా ధైర్యసాహసాల గురించి కధలు కధలు గా వస్తాయు కాలేజ్ లో అని. ఇంతకీ దెయ్యం ఆ చెట్టు మీదే వుందని మా కొందరి స్నేహితుల నమ్మకం.

3 comments:

రాధిక said...

హహ...హ్హ హ్హ...హ్హహ్హ

Rajendra Devarapalli said...

చితక్కొట్టావ్ చాలాదయ్యాలు అలాగే పుడతాయి

అనిర్విన్ said...

HaHa